Wednesday, June 2, 2010

వద్దుర నేస్తం హద్దుల ప్రణయం

వద్దని మనసు పొత్తులబతుకు
పద్దతులంటూ పాపపుపనులు
చిట్లిన వదనం అంతరమదనం
ఎప్పటికైనా తెగలని తగువు

వద్దుర నేస్తం హద్దుల ప్రణయం
వద్దకు చేరే అమృత ప్రళయం
ఎన్నటి మాటది స్వర్గపు ఊహ
నిన్నటి వేళకు సమాధి చేసి
రేపటి నరకపు ద్వారం తెరిచి
వెళ్తున్నావా? తెలిసీ, వలచి..


కన్నులు పొడిచే రాత్రులకంతా
బంటుగ నీవు బతకాలింక
చెంగున ఎగిరే దినాలనింకా
మత్తుగ తూగుతు గడపాలింక


ఎర్రటి కన్నుల జీరలు కరిగి
గుట్టల తూగే పొట్టలుపెరిగి
ఒట్టిన  తోలుతొ బట్ట తలలతో
మరో ప్రపంచపు దారిని తెరిచి
ప్రేగు బంధాన్ని కత్తితొ నరికి
ప్రేమ పుస్తకపు పదాన్ని నమిలి
తంత్రులు తెంచి వీణను విరిచి
కొత్త స్వరాలను సంధిస్తావా?


వెన్నెల రాత్రుల చల్లనిగాలికి
వెచ్చని స్వేదపు చుక్కలుపరిచి
ఇద్దరు నిండిన యుద్దభూమిలో  
మెత్తని శ్వాసల కత్తులు దూర్చి
ఆత్మల హోరులొ రాక్షసచోరులు
తిరిగే వేళను పొగరుతొ గెలిచి
మదపుటేనుగుల తేరులనెక్కి
కొత్త తరాలను సృష్టిస్తావా?

తీపిగుర్తులను చేదుగ మార్చి
ఎగిరేపక్షికి రెక్కలు ఒలిచి    
ఉరికేగుఱ్ఱపు కళ్ళెము పట్టి
ముందు కాళ్ళకు బంధము పెట్టి
కాదూ కూడదు వెళతానంటే  ..
ఎండమావులను తడతానంటే  ...



ఆవేశాల తలలను వంచి
ఆశయతీగల వేళ్ళను తుంచి
బ్రహ్మచర్యాన్ని బానిసచేసి
ప్రకృతి కళ్ళకు గంతలు కట్టి
నిజాలనంతా సమాధి చేసి, నీ
ప్రపంచానికిక పాతరవేసి
ఉక్కు కోటలను నిర్మించాలి
నిప్పు కణాలను చుంబించాలి
అమ్మే ఎరుగని అనుబందాలను
అరచేతిలొ నువ్ బంధించాలి


అంతేలే ఇది  నీలిరహస్యం
అంతే తేలని ఎడారిపయనం
సొంతం కానిది నిన్నటి భ్రమరం
నీదవుతుందొక  విలాస పుష్పం

అదిగో అదిగో అందని స్వర్గము
అంచున ఉందొక నీకై పాదము
అహాన్ని వదలి అణుకువ ఎరిగి
గతాన్ని విడిచి గృతాన్ని పోలి
హాయిగా ఎగిరే సత్తా ఉంటే ..
నీదే నీదే నీదే పోయిక
ఎవరికి అందని జీవిత శిఖరం.


 01 -06 -2010