Tuesday, September 21, 2010

జవాబు వేటలో ప్రశ్నల బాణాలు








(In memory of..)

ఆకాశం అంచులు దాటుతున్నాయ్
అగాధం లోతులను తాకుతున్నాయ్
నిన్నటి కాంతిని నల్ల మబ్బుల్లా ముంచుతున్నాయ్
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

జరిగిందేదో జరిగిందిలే అని ఒకసారి
నాకే ఎందుకు జరిగిందని ఒకసారి
ఏది జరిగినా మన మంచికే అని ఒకసారి
జరగరానిది జరిగిందని ఒకసారి
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

తప్పుల వేటలో ఒక అడుగు
కోపం అంచున ఒక అడుగు
రోదనతో ఒకటి, వేదనతో ఒకటి
ముందొక అడుగు వెనకొక అడుగు
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

తన భవిత ఒక సందేహం
నా బతుకొక సాహసం
పాపం ఎవరిది? శాపం ఎవరికి ?
కాళరాత్రులంటే ఇవేనేమో!
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

అన్యాయం చేసిందెవరు?
న్యాయం చూపేదెవరు?
ప్రేమల అగ్ని పరీక్షలో
సమిధగ మారిందెవరు?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా .. ఆలోచనలు !

కర్మను భరిస్తూ ప్రేక్షకుణ్ణి కావాలా?
కర్తగ మారి త్యాగమేదన్న చేయాలా?
ఎవరి కర్మకెవరు బాద్యులు ఈ లోకంలో?
ప్రేమ భూతమై మింగుతూంటే?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు !

ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయ్
జవాబులతో పని లేకుండా..
ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా?
జవాబిపుడు ప్రశ్నార్ధకం?
అంతు లేని ప్రశ్నల రాత్రులతో
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు!

అసలివి పుట్టిందెపుడు? చచ్చేదెపుడు?
మనిషి పుట్టినపుడు పుడతాయా?
మనసు నుంచి పుడుతాయా?
మనిషి చస్తే చస్తాయా?
మనసు చస్తే చస్తాయా?
మర్రి ఊడల్లా చీమల పుట్టల్లా.. ఆలోచనలు!

No comments:

Post a Comment